తెలుగు రాష్ట్రాలు ప్రతి రోజు ఆర్బీఐ మెట్లెక్కాల్సిన పరిస్థితి
బురుజు.కాం ప్రతినిధి Buruju.com : ఒోవర్ డ్రాఫ్టు కింద రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవటాన్ని ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు అప్రదిష్టగా భావించేవారు. ఆ పేరంటేనే ఉలికి పడేవారు. అటువంటిది.. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు తరచు ఓవర్ డ్రాఫ్టుకు వెళ్తూ.. తమకు ఇదే ఆధారం అన్నతరహాలో మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ సర్కారైతే ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరం ఆరంభ నెలైన ఏప్రిల్ లోనే ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లి ఆర్థిక నిపుణులను నివ్వెరపర్చింది. ఆంధ్రప్రదేశ్.. మే నెల నుంచి అటువంటి ప్రక్రియను మొదలు పెట్టింది.
ముంబాయిలో ఆర్బీఐ ప్రధాన కార్యాలయం బోర్డు
రాష్ట్రాలు ఏటా బడ్జెట్టులో చూపించే అప్పులు, బడ్జెట్టులో చూపించకుండా తెచ్చే అప్పుల గురించే అంతా చర్చించుకొంటూ ఉంటారు. ఇవి కాక.. ఆయా రాష్ట్రాలు ఆర్బీఐ నుంచి ప్రత్యేక స్వీకరణ సదుపాయం( ఎస్.డి.ఎఫ్ ), చేబదుళ్లు (వేస్ అండ్ మీన్స్), ఓవర్ డ్రాఫ్టు అనే మూడు రకాల పద్దతుల్లో అప్పులను తెచ్చుకొంటుంటాయి. వీటి గురించి మాత్రం చాలమందికి పెద్దగా తెలియదు. ఎందుకంటే.. వడ్డీలను కలపి ఈ అప్పులను అదే ఆర్థిక సంవత్సరంలో తిరిగి చెల్లించేస్తుంటారు. ఆయా రాష్ట్రాల రోజువారి రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పుడు నగదు నిల్వ అనేది ఉండదు కనుక అప్పుడు ఒక దాని తర్వాత మరొకటిగా మూడు రకాల పద్దతుల్లో ఆర్బీఐ రుణాలను సమకూరుస్తుంది. మూడింటిలోను ఓవర్ డ్రాఫ్టు అనేది తీవ్రమైంది కనుక దీని జోలికి మాత్రం వెళ్లకుండా మొదటి రెండు సదుపాయలతోనే కొన్ని రాష్ట్రాలు నగదును సర్ధుబాటు చేసుకొంటుంటాయి.
ప్రత్యేక స్వీకరణ సదుపాయం, చేబదుళ్ల పరిమితులను వాడుకొన్నాకనే ఒోవర్ డ్రాఫ్టు
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే మొదటి రెండు సదుపాయాలను ఉపయోగించుకోవటంతో పాటు.. ఓవర్ డ్రాఫ్టు (ఓడీ) కింద రూ. 438 కోట్లను తెచ్చింది. ఆ నెలలో కేవలం జమ్ము కాశ్మీర్, మహారాష్ట్ర మాత్రమే స్వల్ప మొత్తాలను ఓవర్ డ్రాఫ్టు ద్వారా తీసుకొన్నాయి. మరుటి నెలైన మే నెలలో.. ఓడీ కింద రూ.912 కోట్లను తెలంగాణ తెచ్చింది. తెలంగాణ సర్కారు 2020-21లో ప్రత్యేక సదుపాయం ద్వారా రూ.15,750 కోట్లు, చేబదుళ్ల ద్వారా రూ.32,405 కోట్లు, ఓవర్ డ్రాఫ్టు కింద రూ.21,288 కోట్లు కలపి మొత్తం రూ. 69,443 కోట్లను ఆర్బీఐ నుంచి తెచ్చి తిరిగి వడ్డీతో సహా చెల్లించింది. బాండ్లను విక్రయించి రుణాలను సేకరించుకోవటానికి ఆర్బీఐ అనుమతులు ఆలస్యంకావటం వల్లనే ప్రారంభ ఏప్రిల్ నెలలో ఓడీకి వెళ్లాల్సివచ్చిందనేది ఆర్థిక శాఖ వర్గాల వివరణ.
అప్పుల తో ఆస్తులను కల్పించకుండా నోట్లను పంచి పెడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో 24 రోజుల పాటు ఎస్ డి ఎఫ్, 21 రోజుల పాటు చేబదుళ్ల సదుపాయాలను వినియోగించుకొంది. మే నెలకు వచ్చేసరికి ఏపీలో ఉచిత పథకాల కారణంగా రోజువారి రాబడుల కంటే ఖర్చులు బాగా పెరిగి పోవటంతో ఆర్బీఐ కల్పించే అన్ని రకాల రుణ సదుపాయాలను వాడుకొంది. ప్రత్యేక స్వీకరణ సదుపాయం, చేబదుళ్లు కలపి మే నెలలో రూ.2,754 కోట్లను, ఓడీ కింద ఏకంగా మరో రూ. 1,952 కోట్లను వాడుకొంది. మే నెలలో.. ఏపీతో పాటుగా తెలంగాణ, జమ్ముకాశ్మీర్, మణిపూర్ మాత్రమే ఓడీకి వెళ్లాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు రకాల సదుపాయాల్లోను ఏ ఒక్కదానికి వెళ్లేవారే కారు. అంటే.. ప్రభుత్వ రోజు వారి ఖర్చులు రోజువారి రాబడుల కంటే తక్కువగానే ఉండేవి. తమది చేబదుళ్లకు , ఓడీకి వెళ్లే రాష్ట్రం కాదని వైఎస్ గొప్పగా చెప్పేవారు. ఇప్పుడంతటి ఉచిత పథకాలు అప్పట్లో లేవు కనుకనే ఇది సాధ్యమయ్యింది.