తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్దాయం పెరుగుదలతో వయోధికులూ ఎక్కవవుతున్నారు
సగటు ఆయుర్దాయం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఎక్కువగా ఉన్నట్టు వెల్లడయ్యింది. తెలంగాణలో మనిషి జీవిత కాలం 69.6 సంవత్సరాలు కాగా.. ఆంధ్రప్రదేశ్ లో 70 సంవత్సరాలుగా నమోదయ్యింది. అంటే తెలంగాణ కంటే ఆరు నెలలు ఎక్కువగా అక్కడివారు జీవించగలుగుతున్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు వెలువరించిన గణాంకాలను బట్టి.. 1990-95 నడుమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సగటు ఆయుర్దాయం 61.8 సంవత్సరాలు ఉండేది. దీనికి మరో ఎనిమిదేళ్లు కలసి 70కి చేరటానికి 25 ఏళ్ల వ్యవధి పట్టింది.
ఇటువంటి తోడుంటే ఆయుర్దాయం తప్పక పెరుగుతుంది
ఆరోగ్యంపై అవగాహన పెరగటం, అదే సమయంలో వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటం వంటి కారణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా మనిషి ఆయుర్దాయం ఎగబాకుతూనే ఉంది. ప్రస్తుతం భారత్ సగటు జీవిత కాలం 69.4 సంవత్సరాలు కాగా జపాన్ దేశంలో అది 85 ఏళ్లు. తెలుగు రాష్ట్రాలను తీసుకొంటే.. 2014-18 మధ్యన తెలంగాణలోని ఆయుర్దాయం పురుషులకు 68.6 సంవత్సరాలు, మహిళలకు 70.2 సంవత్సరాలుగా తేలింది. ఇరువురుది కలపి చూస్తే 69.6 సంవత్సరాలు.
వైద్య సేవలు అందుబాటులోకి వస్తే.. జీవితకాలం మరింత మెరుగవుతుంది
ఆంధ్రప్రదేశ్ లో ఆయుర్దాయం.. పురుషులకు 68.7 సంవత్సరాలు, మహిళలకు 71.4 సంవత్సరాలుగా ఉంది. ఇద్దరికి కలపి చూసినప్పుడు 70 సంత్సరాలుగా వెల్లడయ్యింది. దేశం మొత్తం మీద చూస్తే దిల్లి, కేరళలలో జీవితం కాలం 75 ఏళ్లు. ఇంకా 70 ఏళ్లు దాటిన వాటిలో ఏపీతో పాటుగా హిమాచల్ ప్రదేశ్ , జమ్ము కాశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. దేశంలోనే వివిధ రాష్ట్రాల మధ్య ఆయుర్దాయంలోని అంతరాలు.. ఆయా చోట్ల గల వైద్య, ఆరోగ్య పరిస్థితులను తెలియజెప్పుతున్నాయి. అతి తక్కువగా.. 65 ఏళ్ళు మాత్రమే జీవిత కాలం గల రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్, చత్తీసుగఢ్ చేరాయి.