కమిషన్ ద్వారానే అల్లూరి మృతి రహస్యం బట్టబయలు ( మొదటి భాగం)
personBuruju Editor date_range2022-07-04
బ్రిటీష్ అధికారులు బహిర్గతపర్చిన అల్లూరి సీతారామరాజు మృత దేహం ఫొటో ఇదే
బురుజు.కాం Buruju.com :
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri seethramaraju) మరణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. గిరిజనులను బ్రిటీష్ సేనలు పెడుతున్న చిత్ర హింసలు చూడలేక సీతారామరాజే స్వయంగా లొంగిపోగా అతన్ని చెట్టుకు కట్టి కాల్చివేశారని. . ఆయన తప్పించుకొని వెళ్లిపోతుండగా బ్రిటీష్ వారు కాల్చి చంపారని. . అసలు ఆయన చనిపోనేలేదని. . పేరంటాలపల్లి సాధువు, బెండపూడి స్వామిజీగా మారింది అల్లూరి సీతారామరాజేనని.. ఇలా రకరకాల వాదనలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చి.. ఇప్పటికి వాటిలో ఏ ఒక్కదానికి స్పష్టతంటూ లేకుండా పోయింది. సీతారామ రాజే కాదు.. ఆయన ప్రధాన అనుచరుడు అగ్గిరాజు ఏమయ్యాడో కూడా అనేక ఏళ్లపాటు మనం పట్టించుకోని దౌర్భాగ్య స్థితి ఆనాడు నెలకొంది . రామరాజు అనుచరుడు ఎండు పడాలు గ్రామస్తుల చేతిలో చనిపోయినట్టుగా ప్రచారం జరగ్గా.. ఆయన అండమాన్ జైలులో శిక్ష అనంతరం అక్కడే స్థిరపడినట్టు 1974లో ఆకాశవాణిలోని ఒక ఇంటర్వ్యూ ద్వారా బయట పడింది. నాటి కాంగ్రెస్ నేత టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఉద్దండులు సైతం సీతా రామరాజును దోపిడీదారుడిగా చిత్రీకరించటం, అందుకు తగ్గట్టుగానే కొన్ని పత్రికలు రామరాజు ఉద్యమాన్ని చులకన చేసి రాయటం.. బ్రిటీష్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు ఊతమిచ్చాయి. ఇంతటి గందరగోళం కారణంగానే.. సీతారామరాజుది ముమ్మాటికీ తన పొలం కోసం చేసిన పోరాటమంటూ స్వాతంత్య్రానంతరం .. 1985లో అక్కడ పోలీసు అధికారిగా పనిచేసిన బర్ల వెంకటరావు అనే ఆయన 2012లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ఒక వ్యాసాన్ని రాసే సాహసం చేయగలిగారు. బెండపూడి సాధువు దంతాన్ని, వెంట్రుకలను తాను భద్రపర్చానని, సీతారామరాజు వారసుల డి.ఎన్.ఏతో వాటిని సరిపోలిస్తే ఆ సాధువే సీతారామరాజుగా తేలుతాడని డాక్టరు హనుమంతు అనే ఒకాయన కొంతకాలం క్రితం మీడియా ముందుకు రాగలిగారు.
అల్లూరి చిన్ననాటి ఫొటో
సీతారామ రాజు ఉద్యమించి వందేళ్లు కావస్తున్న నేపథ్యంలోనైనా ఆయన మరణంపై స్పష్టత అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలచుకొంటే ఇదేమంత కష్టమైన పనేమి కానేకాదు. నేతాజి సుభాష్ చంద్రబోసు అదృశ్యంపై మాదిరిగా ఒక కమిషన్ ఏర్పడగలిగితే అనేక వాస్తవాలు వెలుగుచూస్తాయి. వివిధ ప్రాంతాల్లో.. ముఖ్యంగా హైదరాబాదు, చెన్నై, లండన్ లలో గల బ్రిటీష్ రికార్డులను పరిశీలించగలిగితే చాలా విషయాలు బయటపడతాయి.
అల్లూరిని ఇలా హతమార్చారని ఇప్పుడు నిరూపించగలగాలి
నాటి కొన్ని పత్రికల్లోని రాతలను, వివిధ గ్రంధాల్లో పొందుపర్చిన అంశాలను ‘బురుజు.కాం’ Buruju.com పరిశీలించినప్పుడు.. సీతారామ రాజు మరణంపై అప్పట్లో ఎవరూ సరైన రీతిలో స్పందించనేలేదని తేలింది. దీంతో తప్పు చేసిన బ్రిటీష్ అధికారులు సునాయాసంగా తప్పించుకోగలిగారు. ఒక జిల్లాకు అల్లూరి పేరును పెట్టటం, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలంటూ డిమాండ్ చేయటం వంటివి అల్లూరిని భావితరాలూ మర్చిపోకుండా చేయగలిగే చర్యలే అయినప్పటికీ.. అసలు ఆయన గాథలోని అస్పష్టతను తొలగించటమూ ఇప్పుడు చాలా అవసరం. రామ రాజు తమ అధీనం నుంచి తప్పించుకొని పారిపోతుండగా ఆయన్ని కాల్చివేసినట్టుగా బ్రిటీష్ అధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారు.
అల్లూరి విగ్రహాలను నెలకొల్పి చేతులు దులుపుకొంటే మరణ రహస్యం బట్టబయలయ్యేదెప్పుడు?
అల్లూరి పారిపోయే ప్రయత్నం చేయలేదని, అయన్ని చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత కాల్చిపడేశారని నిరూపించగలిగితే అదే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి అవుతుంది. నిజాల నిగ్గు తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిషన్ ఇచ్చే నివేదికలోని అంశాల ఆధారంగా.. బ్రిటన్ సర్కారుతో క్షమార్పణలు చెప్పించగలగాలి. సీతారామ రాజు విగ్రహాలకు పూలమాలలు వేసి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించేవారంతా ఇప్పుడు కమిషన్ ఏర్పాటు కోసం కృషి చేయాలి. సీతారామరాజు మరణ రహస్యంపై ‘బురుజు.కాం’ వరస కథనాలను అందివ్వనుంది. ఇంతవరకు అంతగా బహిర్గతంకాని కొత్త విషయాలతో కథనాలు ఉండనున్నాయి ( వందేళ్లైనా సమాధానం లేని ప్రశ్నలివి.. రెండో భాగం వచ్చేవారం Buruju.comలో)