బురుజు.కాం : (Buruju.com) నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన 1956లో ఆంధ్ర రాష్ట్రం రూ. నాలుగు కోట్ల రెవెన్యూ లోటుతో ఉంది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం ఆస్తుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆస్తుల కల్పనకు అవసరమయ్యే పెట్టుబడి వ్యయానికి రూ. 15 కోట్లను పొందుపర్చి దానిలో రూ.1.80 కోట్లను నాగార్జున సాగరుకు అందజేసింది. ఆనాటి మొత్తం బడ్జెట్టు రూ. 41 కోట్లలోను పెట్టుబడి వ్యయానికి 37 శాతాన్ని ఖర్చుపెట్టింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల పొలలకు అందుతున్న సాగునీరు, వివిధ రంగాలకు సమకూరుతున్న విద్యుత్తుకు వెలకడితే అది అనేక లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. నాటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల రెడ్డి , కేంద్రంలోని పాలకులు కనుక పెట్టుబడి వ్యయాన్ని విస్మరించి.. సొమ్మునంతా పప్పుబెల్లాల్లా పంచిపెట్టొంటే అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్టే ఉండేది కాదు. పెట్టుబడి వ్యయానికి పాలకులు ప్రాధాన్యం ఇచ్చినట్లైతే భవిష్యత్తు తరాలు ఎటువంటి ప్రయోజనాలను పొందుతాయో తెలుసుకోవటానికి నాగార్జున సాగర్ ఒక ఉదాహరణ. దీనిలో కేంద్ర ప్రభుత్వం సాయం ఉన్నప్పటికీ రాష్ట్రం ఏటా తన బడ్జెట్ల నుంచి తన వాటాలను సమకూరుస్తూ వచ్చింది.
నాగార్జున సాగర్ నిర్మాణ దృశ్యం
ఇటువంటి పెట్టుబడి వ్యయం బడ్జెట్ మొత్తం వ్యయంలో ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ఆస్తులు సమకూరి రాష్ట్రం ప్రగతి పథం వైపు దూసుకెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇంతకు ముందటి ముఖ్యమంత్రులు పెట్టుబడి వ్యయానికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చేవరకు ఉనికిలో ఉన్న ప్రణాళిక సంఘం కూడా ఏటా రాష్ట్రాలు అందజేసే ప్రతిపాదిత బడ్జెట్లలో పెట్టుబడి వ్యయానికి పొందుపర్చిన మొత్తాలపై బాగా దృష్టి సారించేది. అవసరమైతే దానిలో సవరణలు చేసేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తక్షణం ప్రజల జేబుల్లోకి సొ్మ్ము వెళ్లగలిగితే అది ఓట్లను కుమ్మరించిపెడుతుందనే భావనకు వచ్చిన ముఖ్యమంత్రులు.. సంక్షేమ పథకాలు అంటూ కొన్ని పేర్లు పెట్టి వాటి కింద యధేచ్ఛగా సొమ్మును పంచిపెడుతున్నారు. అప్పు మొత్తాలను కూడా ఇలా వ్యక్తులకు పంపిణీ చేస్తుండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆర్థిక నిపుణులు కోడై కూస్తున్నా ప్రభుత్వాలు చెవికెక్కించుకోవటమేలేదు. కొన్నేళ్ల క్రితం వరకు అప్పు మొత్తాలను పూర్తిగా ఆస్తుల కల్పనకే వినియోగించేవారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, భవనాలు వంటివన్నో సమకూరేవి. ఇప్పుడు పెద్ద ఎత్తున అప్పులను తెస్తూనే వాటిని వేరే అవసరాలకు మళ్లించేస్తున్నారు.
ఆస్తుల దన్ను లేని అప్పులు ఎప్పటికీ ప్రమాదమే
రాష్ట్రాలు ఇంతకు ముందు ఏటా తమ పన్ను రాబడుల (రెవెన్యూ ఆదాయం) నుంచి కొంత మిగుల్చుకొని ఆ మొత్తాలను పాత అప్పుల చెల్లింపునకు ఉపయోగించేవి. సొమ్మును పప్పుబెల్లాల్లా పంచటం మొదలు పెట్టాక రెవెన్యూ ఖర్చు గణనీయంగా పెరిగిపోతూ రెవెన్యూ మిగులు స్థానే లోటు ఏర్పడుతోంది. దీంతో ఇటువంటి లోటు భర్తీకి, పాత అప్పుల చెల్లింపునకు ఇప్పుడు కొత్త అప్పులే శరణ్యమవుతున్నాయి. అంటే అప్పు మొత్తాలను సైతం పాలకులు వివిధ కార్యక్రమాల పేర్లతో ఎవరెవరికో పంచిపెట్టేస్తున్నారు. దీంతో అప్పుల నుంచి పెట్టుబడి వ్యయం రూపంలో ఆస్తుల కల్పనకు వెళ్లేది నానాటికి తగ్గిపోతోంది. బడ్జెట్టు పుస్తకాలు ఈ విషయాలను కళ్లకు కడుతున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకుల్లోను చలనం ఉండటమేలేదు. ఆంధ్రప్రదేశ్ లో 2016-17లో నికరంగా రూ.30,769 కోట్ల అప్పును తీసుకురాగా దానిలోని పెట్టుబడి వ్యయానికి వెళ్లింది రూ.15,388 కోట్లు.. అంటే 51 శాతం మేర ఆస్తుల కోసం వెళ్లింది. ఇటువంటి పరిస్థితి క్రమేణా దిగజారిపోతూ 2019-20నాటికి 34తానికి పడిపోయింది. 2020-21లో ఏపీ సర్కారు నికర అప్పులు రూ.57,430 కోట్లను తేగా అందులో కేవలం రూ.20,640 కోట్లు.. అంటే 35 శాతాన్ని మాత్రమే పెట్టుబడి వ్యయం కింద చూపించింది. మిగతా 65 శాతం అప్పును సంక్షేమ పథకాలతో కూడిన రెవెన్యూ ఖర్చులకు, పాత అప్పుల చెల్లింపునకు వినియోగించింది.
అప్పుల్ని పంచిపెట్టటం నాయకత్వ లక్షణం కాదు
తెలంగాణ రాష్ట్రం 2016-17 నుంచి 2018-19 వరకు రెవెన్యూ మిగుల్లో ఉంది. రైతు బంధు వంటి వ్యక్తిగత ప్రయోజనం కలిగించే పథకాలకు అంకురార్పణ జరిగిన తర్వాత రాష్టం రెవెన్యూ లోటులోకి వెళ్లిపోయి ఏపీ మాదిరిగానే ఇక్కడా అప్పు మొత్తాల్లో సింహ భాగాన్ని పెట్టుబడి వ్యయానికి కాకుండా ఇతర అవసరాలకు ఖర్చుపెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ద్వారా 2020-21లో రూ.49,038 కోట్లను నికర రుణాలుగా తెచ్చి అందులో కేవలం రూ.15,922 కోట్లను ( 32శాతం) మాత్రమే ఆస్తుల కల్పనకు వినియోగించింది. మిగతా మొత్తమంతా పాత అప్పుల చెల్లింపు, రెవెన్యూ లోటు భర్తీకి ఉపయోగించారు. ఉభయ రాష్ట్రాల పాలకులు తమ రాజకీయ తక్షణావసరాలను పక్కన పెట్టి.. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించినప్పుడే సాగునీటి ప్రాజెక్టులు వంటి ఆస్తులను సమకూర్చేందుకు అవసరమయ్యే పెట్టుబడి వ్యయం పెరుగుతుంది. రెవెన్యూ (పన్నులు, పన్నేతర) ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలను అన్వేషించకుండా అప్పులను దైనందిన ఖర్చులకు మళ్లించటం ఎంతమాత్రం శ్రేయోదాయకంకాదు. ప్రణాళిక సంఘం స్థానే ఏర్పాటైన ‘నీతి అయోగ్’ ఇవేమీ పట్టించుకోకపోతుండటం వల్లనే రాష్ట్రాలు భారీగా అప్పుల్ని తేవటమే కాకుండా వాటిని తమకు తోచిన విధంగా ఖర్చుపెట్టేస్తున్నాయి. ఆస్తులు సమకూరితే వాటి వల్ల ప్రజలకు, ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెరుగుతాయి. అటువంటప్పుడు అప్పులను తిరిగి చెల్లించటానికి పెద్దగా ఇబ్బందులు ఉండబోవు. ఆస్తులంటూ లేనప్పుడు అభివృద్ధి కుంటుపడి పాత అప్పులను తిరిగి చెల్లించటమే కష్టమై పోతుంది. ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్లలో చూపించి తెచ్చిన నికర అప్పుల్లో .. 2020-21లో 35 శాతం , 2019-20లో 34 శాతం, 2018-19లో 57 శాతం, 2017-18లో 57 శాతం, 2016-17లో 51 శాతం మేర మాత్రమే ఆస్తుల కల్పనకు వెళ్లాయి.