( బురుజు.కాం Buruju.com ప్రతినిధి) కరోనా మహమ్మారి పలువురు వైద్యులకు కోట్లు కుమ్మరించి పెట్టింది. అటువంటి వారికి భిన్నంగా.. హైదరాబాదుకు చెందిన ఒక వైద్యుడు మాత్రం తన సొంత పైకంతో కరోనా బాధితులను ఆదుకొని.. మానవత్వం మిగిలే ఉందని చాటి చెప్పారు. ఆయనే.. డాక్టర్ బొట్టు చంద్రకాంతరావు . ప్రముఖ దంత వైద్యులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలున్న చంద్రకాంత్.. కరోనా అంటేనే ప్రాణాలు విలవిల్లాడుతున్న సంక్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. కరోనా బారిన పడినివ్వని అద్భుత ఆయుర్వేద మందులను పెద్ద ఎత్తున ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. కరోనాకు చిక్కుకొన్నవారికీ మందులను ఇచ్చారు. దీంతో కరోనా రోగుల కుటుంబ సభ్యులు ఈ మందులను వేసుకొని ధైర్యంగా తమ వారికి సపర్యలు చేయగలిగారు. నగరంలో 2020, జూన్ -సెప్టెంబరు నెలల మధ్య ఆసుపత్రుల్లో అసలు పడకలు లభించేవే కాదు. ఒక వేళ బెడ్ ఉంటే ఒక్కో రోగి నుంచి రూ.35 లక్షల వరకు గుంజిన ఆసుపత్రులు ఉన్నాయి. ఆసుపత్రిలో బెడ్ లభించక ఇంటిలోనే ఉంటూ కుమిలిపోతున్న తమకు చంద్రకాంత్ ఫోన్ నెంబరు పరిచయస్తుల ద్వారా తెలిసిందని, ఆయన అందజేసిన మందులతో తన భర్త కరోనా నుంచి తేరుకోవటంతో పాటు, తాను కూడా మందులను వేసుకొని..తనకేమీ కాదనే ధైర్యంతో ఉండగలిగానని స్వప్న అనే గృహిణి వెలువరించిన ఒక ఆడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. షిరిడీ సాయిబాబాయే తన కుటుంబాన్ని చంద్రకాంత్ రూపంలో ఆదుకొన్నారంటూ ఆడియోలో ఆమె శ్లాఘించారు. ఇటువంటి ఆడియోలు, వీడియోలు మరికొన్ని వెలువడ్డాయి. దీంతో ఎంతో మంది చంద్రకాంత్ నుంచి ఉచితంగా మందులను తీసుకెళ్లారు. మందులను ఇవ్వటమే కాకుండా.. ఎవరు ఫోను చేసినా ఆయన మనో నిబ్బరాన్ని కల్పిస్తూ వచ్చారు. దూర ప్రాంతాల్లో ఉండేవారికి తన సొంత ఖర్చులతోనే మందులను పంపారు. హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రి వద్దగల కౌంటర్ ద్వారానూ మందులను అందజేశారు. బసవ తారకం కేన్సర్ ఆసుపత్రిలో ఈ మందులను వేసుకొన్న సిబ్బంది దరిదాపుల్లోకి కరోనా రాలేకపోయింది. విషయం తెలుసుకొన్న ఒక ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం .. మందులను తమకు సరఫరా చేస్తే పెద్ద మొత్తంలో ఇస్తామని ఆశపెట్టింది. ఉచితంగా పంపిణీ చేసేందుకు తెస్తున్న మందులతో కార్పోరేట్ ఆసుపత్రులు వ్యాపారం చేయాలనుకోవటం అయనకు ఎంత మాత్రం నచ్చలేదు. అందుకే అటువంటి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు . ( అప్పటికింకా కరోనా సంబంధించి అల్లోపతి మందులేవీ అందుబాటులోకి రాలేదు) కరోనా తదుపరి దశల్లోనూ డాక్టర్ చంద్రకాంతరావు ఎంతో మందికి ఉచితంగా మందుల కిట్లను అందజేస్తూ వచ్చారు. ఆయన మాత్రం ప్రచారానికి దూరంగా.. నిస్వార్ధంగా తన పనిని తాను చేసుకొంటూ వెళ్లే తత్వం గలవారు. విషయం తెలుసుకొన్న ‘బురుజు.కాం’ కొంత ఆరాతీయగా ఆయనకు సంబంధించి మరికొన్ని విషయాలు తెలిశాయి.
ఇదే జీవ రహస్యం
ప్రజల కోసం తపించే వైద్యునిగా పేరుపడ్డ చంద్రకాంత్ .. 1996లోనే స్కోప్ ( సొసైటీ ఫర్ క్యాన్సర్ ఇన్ ఓరల్ కావటీ ప్రవెన్షన్ త్రూ ఎడ్యుకేషన్ ) అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి.. వేలాది మంది జీవితాలను చక్కదిద్దారు. ఫేషయల్ సర్జన్ కావటంతో బసవతారకం ఆసుపత్రిలో 600 పైగా టీ.ఎం.జె, ఓరల్ క్యాన్సర్ సర్జరీలను నిర్వహించారు. నోరు మూసుకుపోయిన నిరుపేదలు ఎంతో మందికి ఉచితంగానే ఆపరేషన్లు చేశారు. ఉచిత దంత చికిత్స శిబిరాలను, పొగాకు వ్యతిరేకంగా సభలు, ర్యాలీలను ఆయన నిర్వహించారు. విదేశాల్లో సైతం ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహావీర్ దంత ఆసుపత్రిలో పనిచేస్తున్న చంద్రకాంత్.. 2000 సంవత్సరంలో హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రాగా.. పొగాకు రహిత ప్రపంచం కోసం కృషి చేయాల్సిందిగా ఆయన్ని కోరారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ , ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ వంటి పలువురు ప్రముఖులకు టుబాకో లేని సమాజ అవశ్యకతను ఆయన స్వయంగా వివరించారు. పొగాకు ఉత్పత్తుల వల్ల బతుకులు ఎలా తెల్లారి పోతున్నదీ ఎన్నో జీవితాలను స్వయంగా చూడటం వల్లనే ఆయన ఇంతగా తపన పడతున్నారు. మహావీర్ ఆసుపత్రిలో తన వద్దకు వచ్చేవారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారి యోగక్షేమాలను కనుక్కొంటూ ఉంటారు. ఆయన్ని కలిసినవారంతా సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంటారు. నగరంలో ఆదాయపు పన్ను శాఖలోని 30 ఏళ్లు కూడా ఉండని అధికారిణి కొంత కాలంక్రితం పంటి నొప్పి అంటూ చంద్రకాంత్ ను కలిశారు. మిగతా ఆసుపత్రులవారైతే చాల హడావిడి చేసి భారీగా ఫీజు గుంజేవారు . డాక్టర్ చంద్రకాంత్ మాత్రం.. కేవలం రోజూ కొంత సేపు ఎండలో నిలబడటమే మీకు మందు అంటూ చెప్పి ఆమెను పంపించేశారు. ఆ అధికారిణి.. నగరంలో ఉంటున్నదీ ఏసీ ఇంటిలో.. ఆఫీసుకు వచ్చేది ఏసీ కారులో.. ఆఫీసులో పనిచేసేదీ ఏసీ గదిలో.. ఆమెకు ఎండ అంటూ తగలకపోవటమే పంటినెప్పికి కారణంగా తేల్చటం చంద్రకాంత్ కే సాధ్యమయ్యింది. ఇటువంటి దృష్టాంతాలు చాలానే ఉన్నాయి. కరోనా తీవ్రంగా విజృంభించి ఉన్న సమయంలో ఆయన ఇంటికి పరిమితమై పోకుండా నలుగురికి సాయపడుతూ రావటం వల్లనే ఆయన జీవిత విశేషాలను తెలుసుకోవాలనే ఉత్సుకత చాలా మందికి ఏర్పడింది. ఆయన ఆసుపత్రిలో గోడకు అమర్చివున్న ఒక పోస్టరు అక్కడికెళ్లేవారిని విపరీతంగా ఆకట్టుకొంటుంది. దానిలో ఆయన తండ్రి చెప్పిన ఓ జీవిత సత్యం పొందుపర్చివుంది.
అబ్దుల్ కలాంతో డాక్టర్ చంద్రకాంత్
తండ్రి అక్షరాలు.. ఆయన తరగని ఆస్తులు
తల్లి తండ్రుల నుంచి వచ్చిన స్థిరాస్తుల గురించి అంతా చెబుతారు. డాక్టర్ చంద్రకాంత్ మాత్రం తనకు తన తండ్రి బొట్టు లక్ష్మీనారాయణ అందించి వెళ్ళిన కొన్ని అక్షరాలనే తన తరగని ఆస్తులుగా గొప్పగా చెప్పుకొంటారు. ఆయన తండ్రి రాసిన ఎనిమిది లైన్ల వచనాన్ని ఎవరు చదివినా ‘ ఎంత గొప్పగా రాశారు’ అని మనసారా మెచ్చుకోక మానరు. సేవా భావం అనేది లోపిస్తున్న వైద్య రంగంలో... ఒక కాంతి పుంజంలా భాసిల్లుతున్న చంద్రకాంత్ వంటి వారి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఆయన తండ్రి అందజేసిన ఎనిమిది లైన్లలోని పరమార్ధాన్ని పరిశీలిస్తే... ఏకంగా ఒక సిద్ధాంత గ్రంధం రాయతగ్గంతటి తత్వం అందులో నిభిడీకృతమై ఉన్నట్టు బోధపడుతుంది. ఆయన ఏమంటారంటే.. ‘‘ దైవాన్ని శక్తినిమ్మని వేడుకొంటే కష్టాలు కలిగించి బలాన్ని చేకూర్చుతాడు... దైవాన్ని తెలివితేటలిమ్మని కోరితే సమస్యల్ని సృష్టించి సరిదిద్దుకొమ్మంటాడు... దైవాన్ని సంపదలిమ్మని అర్ధిస్తే బుద్ధిని, బలాన్ని ఇచ్చి సంపాదించుకొమ్మంటాడు... దైవాన్ని ధైర్యాన్ని ప్రసాదించమని కోరుకొంటే ఆపదలను కలిగించి అధిగమించమని ఆదేశిస్తాడు... దైవాన్ని ఉపాధి కల్పించమని వేడుకొంటే అవకాశాలను చూపిస్తాడు... మనం కోరినదేదీ దైవం మనకు సమకూర్చలేడు... కాని మన అవసరాలన్నీ అమర్చి ఆదుకొంటాడు... ఈ రహస్యం బోధపడితే మీ జీవితాలు గొప్పవవుతాయి.. సుఖమయమవుతాయి.’’ అద్భుతమైన విషయంతో కూడి ఉన్న ఈ వాక్యాలు.. డాక్టర్ చంద్రకాంత్ ను ‘‘ జీవరహస్య పౌండేషన్’’ ఏర్పాటుకు పురికొల్పాయి. ఆయన శ్రీమతి డాక్టర్ బొట్టు పద్మజ.. జీవరహస్య ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉపయుక్తమైన సాహిత్యాన్ని ప్రచురించటం, విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ, గ్రామీణ మహిళల స్థితిగతుల్లో మార్పులు.. వంటివి ఫౌండేషన్ లక్ష్యాలు. బొట్టు లక్ష్మీనారాయణ.. ఖమ్మం జిల్లా నీటిపారుదల శాఖలో ఇంజినీర్ గా పనిచేసి.. 2005లో కీర్తి శేషులయ్యారు. భౌతికంగా దూరమైనా.. అయన డైరీలో లభించిన అక్షరాలే తయన తమకిచ్చిన ఆస్తి అని చంద్రకాంత్ గర్వంగా చెబుతారు. లయన్స్ క్లబ్ ద్వారాను చంద్రకాంత్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
డాక్టర్ చంద్రకాంత్, ఆయన సతీమణి డాక్టర్ పద్మజ
రోజుకు రెండు మూడు ఆసుపత్రుల్లో పనిచేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తూ.. సేవాతత్పరత అనే భావననే మర్చిపోయిన వైద్యులకు డాక్టర్ చంద్రకాంత్ వంటివారి సేవలు కాసింతైనా ఆలోచింప జేస్తే బాధల్లో ఉన్నవారికి ఎంతోకొంత ఉపశమనం లభించినట్టే.