(‘బురుజు’ ప్రతినిధి)
చరిత్రలోని ఒక వాస్తవ సంఘటనను అద్భుత స్పూర్తిదాయక చిత్రంగా ఎలా మలచవచ్చో చాటి చెప్పిందే మరాఠా చిత్రం ‘హిరకాని’. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఛత్రపతి శివాజీ పాలన కాలంలో ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వటం కోసం రాత్రి వేళ.. దారితెన్ను తెలియని ఒక ఎత్తైన కొండను దిగటమే సినిమా ఇతివృత్తం. సినిమాకు భాష ఏమాత్రం అడ్డురాదు . చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు ఉత్కంఠకు లోనవుతాడు. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా మహడ్ లోని ఎత్తైన కొండపై గల కోట నుంచి శివాజీ క్రీ.శ 1650 ప్రాంతం నుంచి పాలించాడు. కోట దిగువలోని ఒక గ్రామానికి చెందిన హిరకాని అనే పాలను అమ్మే మహిళ ప్రతిరోజు కోటలోకి మెట్లమీదగా వెళ్లి పాలను పోస్తూ ఉంటుంది. అమెకు నెలలు నిండని పసిబిడ్డ ఉంటుంది. ఒక రోజు.. పసిబిడ్డను ఒక వృద్ధురాలికి అప్పగించి కోటలోకి వెళ్తుంది. అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో కోట ప్రధాన ద్వారం తలుపులు మూసుకుపోతాయి. సాయంత్రమైతే తలుపులను మూసివేయటం అక్కడి నిబంధన. అప్పటికి బయటి వారు ఎవరైనా లోపల ఉండిపోతే వారికి ఆ రాత్రికి కోట కాపలాదారులే భోజన వసతులను ఏర్పాటు చేస్తుంటారు. బయటకు పంపాల్సిందిగా హిరకాని బతిమాలినా .. తాము నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించలేమని కాపలాదారులు చెబుతారు. దీంతో అమె ఆ రాత్రివేళ.. ఎవరూ చేయని సాహసానికి ఒడుగడుతుంది. కోట వెనుక వైపు నుంచి కిందకు దిగుతుంది. అదేమీ వచ్చేపోయే మార్గం కాదు కనుక పెద్ద రాళ్లతోను, పొదలతోను చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పసిబిడ్డను అక్కున చేర్చుకోవటమొక్కటే అమె ముందున్న లక్ష్యం. దాంతో ఆమె ఎన్నెన్నో అవాంతరాలను ఎదుర్కొంటుంది. అమె కిందకు దిగుతుండటం చూసిన సైనికులు ఆమెపై అగ్నిగోళాలను జార విడుస్తారు. తేనెటీగలు ఆమెపై దాడి చేస్తాయి. విష సర్పం ఒంటిపై పాకుతుంది. ఆ సమయంలో అక్కడి నుంచి కొంత దిగవకు పడి ఒక కొమ్మ ఆసరాతో ప్రాణాన్ని నిలుపుకొంటుంది. అక్కడి నుంచి ఎట్టకేలకు కిందకు దిగి ఇంటికి వెళ్లే సరికి నోటికి రక్తం మరకలు అంటుకొని ఉన్న తోడేలు ఇంటి అరుగుపై తచ్చాడుతూ కనిపిస్తుంది. అది బిడ్డను తినేసిందేమోనని కలవరపడిన ఆమె.. మరో సారి ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకొంటుంది. ఇంటి బయట భర్త భద్రపరచి ఉంచిన ఈటెను చేతపట్టి ఒక్కొదున తోడేలును చంపేస్తుంది. ఇంటిలోకి అందోళనగా వెళ్లిన ఆమెకు.. పసిబిడ్డ అడుకొంటూ కనిపించగానే అలౌకిక ఆనందానికి లోనవుతుంది. పసిబడ్డను సాకుతూ వచ్చిన వృద్ధురాలికి చేతులు జోడించి మనసారా ధన్యవాదాలు తెలుపుతుంది. కొండను దిగేటప్పుడు అమె చనిపోయి ఉంటుందని భావించి.. ఉదయం ఆమె ఇంటికి వచ్చిన సైనికులు.. ఆమె బతికి ఉండటమేకాకుండా తోడేలును హతమార్చినట్టుగా తెలుసుకొని ఆశ్చర్యపోతారు. బిడ్డతో సహా ఆమెను కోటలోకి శివాజీ వద్దకు తీసుకెళ్తారు. శివాజి మహారాజును కళ్లారా చూడాలని ఎప్పటి నుంచో ఆశ పడుతున్న హిరకానికి.. సాక్షాత్తూ శివాజీయే సింహాసనంలో అసీనులై ఉండటం చూసి నోట మాటరాదు. కోటను అలా దిగటం చట్టాన్ని అతిక్రమించటమేనని శివాజీ ఆమెకు చెప్పి..కోట వెనుక వైపు నుంచి మళ్లీ దిగాల్సిందిగా ఆమెను అడుగుతాడు. బిడ్డను చూసుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే రాత్రి వేళ తాను కొండను దిగగలిగానని, ఇప్పుడు బిడ్డ తనతోనే ఉన్నందున మళ్లీ అటువంటి సాహసం చేయలేనని ఆమె ప్రాధేయపడుతుంది. అమె ఎక్కడి నుంచైతే కోటను దిగిందో అక్కడ ఒక బురుజును నిర్మించి దానికి హిరకాని పేరును పెట్టాల్సిందిగాను, ఆమెను సత్కరించి ఇంటికి పల్లకీలో పంపాల్సిందిగాను శివాజీ ఆదేశిస్తాడు. ఆమె బిడ్డకు పేరుకూడా పెడతాడు. మరాఠా నటి సోనాలి కులకర్ణి.. హిరకాని పాత్రలో అద్భుతంగా నటించింది. కొండను దిగే సన్నివేశాలు ప్రేక్షకులు కన్నార్పకుండా చూడాల్సినంత ఉత్కంఠను కలిగిస్తాయి. హిరకాని బురుజు ఇప్పటికీ ఉంది. దానికి ఇటీవల కాలంలో రోప్ వేను అందుబాటులోకి తెచ్చారు. రాయగడ్ కోట పూనేకు 60 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. తెలుగులోను హిరకాని వంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చిత్రాల వల్ల చరిత్రపై ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల అనుష్క నటించిన ‘రుద్రమదేవి’, చిరంజీవి ‘సైరా నర్సింహారెడ్డి’ ,బాలకృష్ణ ‘ గౌతమి పుత్రశాతకర్ణి’ వంటి సినిమాలు వచ్చినా అవన్నీ ఆయా చారిత్రక వ్యక్తుల జీవిత కథలను తెలియజెప్పేవి. దాదాపు 70 ఏళ్ల క్రితం ఎన్టీఆర్, భానుమతి నటించిన ‘మల్లేశ్వరి’ మాత్రం ఒక సంఘటన ఆధారంగా రూపొందింది. శ్రీకృష్ణదేవరాయుల పాలన కాలంలో.. ప్రభువులకు నచ్చిన యువతులను అంతఃపురానికి ఆహ్వానిస్తూ పల్లకిని పంపే విధానం ఉండేది. ఒకసారి కోటలోకి ప్రవేశించాక ఇక తిరిగి బయటి పురుషులను కలవటానికి సాధ్యంకాదు. దాని ఆధారంగానే మల్లేశ్వరి రూపొంది.. ఇప్పటికీ అదొక మహాకావ్యంగా నిలిచింది. హిరకాని వంటి సంఘటనలను చిత్రాలుగా తీసేటప్పుడు చరిత్రను మరీ వక్రీకరించకూడదు. చరిత్ర చట్రంలోనే ఉంటూ సినిమా తీయాలంటే కత్తిమీద సాము కనుకనే దర్శకులు అటువంటి సాహసాలు చేయటంలేదనుకోవాలి. తెలుగు దర్శకులు చరిత్ర పుస్తకాలను తిరగేస్తే హిరకాని వంటి సంఘటనలు మనకూ అనేకం ఉంటాయి.