బురుజు.కాం Buruju.com ప్రతినిధి: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలలో తాజాగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా.. దాని తర్వత స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది. మరో ఆందోళన కలిగించే విషయమేమిటంటే.. ఇటువంటి పెరుగుదల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను పట్టణాల కంటే గ్రామాల్లోనే అత్యధికంగా ఉంటోంది. ధరల పెరుగుదల స్థాయిని తెలియజెప్పేదే ద్రవ్యోల్భణం. ద్రవ్యోల్భణం రేటు 2022 , జూన్ నెలలో తెలంగాణలో 10.05 శాతం ఉండగా .. ఇదే నెలలో ఆంధ్రప్రదేశ్ లో 8.63 శాతంగా నమోదయ్యింది. అంటే.. 2021 మే నెలలో వంద రూపాయిలకు లభించిన ఒక వస్తువును ఇప్పుడు సంవత్సర కాలంలోనే తెలంగాణలో రూ.110.05, ఆంధ్రప్రదేశ్ లో రూ.108.63 పెట్టి కొనాల్సివస్తోంది. . దేశ వ్యాప్తంగా వస్తువుల సగటు పెరుగుదల ఇదే కాలంలో 7.01 శాతంగా మాత్రమే నమోదయ్యింది.
రోజురోజుకు మారిపోతున్న ధరలతో బెంబేలెత్తుతున్న సగటు జీవి
అన్ని రాష్ట్రాల్లోను కొన్ని ముఖ్యమైన వస్తువుల ధరలను జాతీయ గణాంకాల శాఖ ప్రతినెలా సేకరించి వినియోగదారు ధరల సూచీని , ద్రవ్యోల్భణం రేటును లెక్కగడుతుంది . పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), విశ్రాంత ఉద్యోగులకు కరవు భృతి (డీఆర్) ఇవ్వటానికి ద్రవ్యోల్భణం రేటే ప్రామాణికం. రాష్ట్రాల్లోని జీవన వ్యయం అంచనాకూ ప్రామాణికంగా ఇది తోడ్పడుతుంది. ద్రవ్యోల్భణానికి అనుగుణంగా.. కరెన్సీ కొనుగోలు సామర్ధ్యం క్రమేణా తగ్గుతుంది. ద్రవ్యోల్భణం రేటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటాన్ని బట్టి ఆయా వస్తువుల సేవలకు మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 2022, జూన్ నెలలో దేశంలోని 22 రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ ద్రవ్యల్భోణం మిగతా అన్ని రాష్ట్రాలను అధిగమించి రెండు అంకెలకు చేరుకొంది. ఆంధ్రప్రదేశ్ మే నెల ద్రవ్యోల్భణం 8.49 శాతం ఉండగా.. అది స్వల్పంగా పెరిగి జూన్ నెలకు 8.63 శాతానికి చేరుకొంది. తెలంగాణ మాత్రం మేనెలోని 9.45 శాతం నుంచి జూన్ నెలకు ఏకంగా 10.05 శాతానికి చేరింది. హర్యానా 8.08 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. బిహారులో కేవలం 4.68 శాతం మాత్రమే ఉండటం విశేషం.
పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించటం పాలకుల విధి.
సాధారణంగా వస్తువుల ధరలు పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పట్టణాల కంటే గ్రామాల్లోనే ధరలు అధికంగా ఉంటున్నాయి. ద్రవ్యోల్భణం రేటు 2022, జూన్ నెలలో తెలంగాణ గ్రామాల్లో ఏకంగా 10.93 శాతం , ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో 8.65 శాతంగా నమోదయ్యింది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాల ద్రవ్యోల్భణం సగటు 7.01 శాతం మాత్రమే ఉంది. కరోనా తదితర కారణాల వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లి సామాన్యుడు విలవిల్లాడి పోతుండగా .. మరో వైపు వస్తువుల ధరలు అతని నడ్డి విరుస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకులు ధరలను అదుపు చేసే అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టు జాతీయ గణాంకాల శాఖ తాజా నివేదికను బట్టి స్పష్టమవుతోంది.