(పిళ్లా సాయికుమార్: Pilla sai kumar : buruju.com) అమరావతి రాజధానిగా ఉన్నట్లైతే బౌద్ధం ద్వారా పలు దేశాలకు సాంస్కృతిక వారధిని నిర్మించుకోవచ్చనే జర్నలిస్టు అభిప్రాయం.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించిన కురసాల కన్నబాబుకు చాలా ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. ‘చూడండి అధ్యక్షా.. అమరావతి రాజధానిగా ఉంటే చైనాతో యుద్ధాలను అపేయవచ్చట’ అంటూ 2020, జనవరి 20వ తేదీన శాసన సభలో ఆయన చాలా సేపు వ్యంగ్యాస్త్రాలను సంధించారు. కన్నబాబు మాటలు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్లాదపరిచి.. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు నవ్వుతూ కనిపించారు. మంత్రి కన్నబాబు ప్రస్తావించిన అంశాలు 2020, జనవరి 18వ తేదీన ‘ఈనాడు’ పత్రికలో నాలుగో పేజీలో నేను రాసిన వ్యాసంలోనివి. కన్నబాబు అనేక ఏళ్లు ఇదే పత్రికలో విలేఖరిగా పనిచేశారు. ఆయన కూడా అదే నాలుగో పేజీలో విద్యుత్ తదితర అంశాలపై కొన్ని వ్యాసాలు రాశారు. సంపాదక పేజీలో ప్రచురించే సంపాదకీయం తప్ప మిగతా వ్యాసాలను ‘ఈనాడు’ యాజమాన్యం చెప్పిరాయించేవి కానేకావన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. ఒక జర్నలిస్టు రాసిన వ్యాసాన్నీ రాజకీయ తదితర కోణాల్లో చూడాలనుకొన్నప్పుడు అంత వరకు తమకు తెలిసిన వాస్తవాలను సైతం పక్కన పెట్టటం రాజకీయ నాయకులకు పరిపాటే. పూర్వాశ్రమంలో జర్నలిస్టు అయినప్పటికీ రాజకీయ నాయకుడుగా మారటంతో కన్నబాబూ అదే పనిచేశారు. ఆ వ్యాసాన్ని ‘ఈనాడు’ యాజమాన్యమే రాయించినట్టు చెబుతూ మధ్యలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునూ దీనిలోకి తెచ్చారు. వ్యాసంలోని కొన్ని పేరాలను ఆయన సభలో చదివి వినిపించారు. కొందరు సభ్యులు ‘ఏ పేపరు’ అంటూ అడిగితే ‘ఈనాడు’ అని ఆయన వెల్లడించారు. పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని నిర్ణయించిన వారికి అమరావతి గురించి ఏమి చెప్పినా నచ్చకపోవటం సహజమే. అందుకు ఒక జర్నలిస్టు సొంత అభిప్రాయాన్ని సైతం సహించలేకపోవటమే ఆశ్చర్యపర్చే అంశం.
‘ఈనాడు’లో వెలువడిన వ్యాసం
అమరావతి పూర్వనామం ధాన్యకటకం. సాక్షాత్తూ బుద్ధుడే అక్కడ నడయాడాడని దేశ,విదేశీ బౌద్ధ అభిమానులు ఎందరో భావిస్తూ దాన్నొక అత్యంత పవిత్ర స్థలంగా పరిగణిస్తారు. బౌద్ధ బిక్షువులు అక్కడ రాత్రి నిద్రచేసి.. తిరిగి వెళ్లేటప్పుడు అక్కడి కాసింత మట్టిని తమ వెంట తీసుకెళ్లి తమకు కావాల్సిన వారికి ఆపురూప కానుకగా అందజేస్తారు. అక్కడి శిల్పాలు అత్యంత నాజూకు తనంతో ప్రపంచంలోనే ‘అమరావతి శిల్ప కళ’ అనే ప్రత్యేక ముద్రను వేయించుకోగలిగాయి. అటువంటి ఇక్కడి మరెన్నో శిల్పాలు విదేశాల్లో కొలువుతీరి ఉన్నాయి. ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్న అమరావతిలో రాజధాని నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైనందున దాన్ని కొనసాగించుకొంటే వచ్చే ప్రయోజనాలు ఏరీతిలో ఉండేదీ ఒక కొత్త కోణంలో ఆవిష్కరించిందే ‘ఈనాడు’లో ‘ భవితకు బాసటగా ఘనచరిత్ర’ శీర్షికతో వెలువడిన వ్యాసం. రాజధాని అమరావతిలో ఉన్నట్లైతే బౌద్ధాన్ని అభిమానించే దేశాలతో సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుకొని అక్కడి పెట్టుబడిదారులను ఆకట్టుకోవటానికి వీలవుతుందనే అభిప్రాయం వ్యాసంలో ఉంది. అంతే తప్ప మంత్రి (అప్పటికి మంత్రిగా ఉన్నారు) కన్నబాబు అసెంబ్లీలో విమర్శించినట్టుగా.. అమరావతి రాజధానిగా ఉంటే చైనాతో యుద్ధాలను ఆపవచ్చనే అంశం వ్యాసంలో ఎక్కడా లేదు. లేని విషయాన్ని మంత్రి ప్రస్తావించారు కనుక బౌద్ధం ద్వారా చైనా ఎటువంటి దౌత్యాన్ని నెరపుతుందో ఇప్పుడు చూద్దాం.
అమరావతి స్థూపం నమూనా
బౌద్ధులు ఎక్కువగా గల వివిధ దేశాల్లో బౌద్ధం పేరుతో తిష్టవేసే పన్నగాలు చైనా పన్నుతూనే ఉంది. నేపాల్ దేశంలోని రాజకీయాలను శాసించేందుకు బౌద్ధాన్నీ బాగా వినియోగించుకొంటోంది. నేపాల్ లోని బుద్ధుని జన్మ స్థలంగా ప్రాచుర్యంపొందిన ‘లుంబినీ’ని అభివృద్ధి పర్చటానికని అక్కడ అడుగుపెట్టింది. నేపాల్ ఒకప్పుడు భారత దేశంలో విలీనమవుతానంటే నాటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదని మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ తన గ్రంధంలో వెల్లడించారు. అటువంటి నేపాల్.. చైనా అండదండలతో భారత్ పైనే కాలుదువ్వే పరిస్థితి వచ్చింది. చైనా తన వద్ద గల బుద్ధుని హస్తికలతో తరచు థాయిల్యాండ్ తదితర దేశాల్లో ప్రదర్శనలను నిర్వహిస్తూ అక్కడి వారి అభిమానాలను చూరగొనే ప్రయత్నాలు చేస్తోంది. చైనా సామ్రాజ్యవాద పోకడలను ఇటువంటి దౌత్య నీతి కొంత తేలిక చేసి చూపించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. బౌద్ధం ద్వారా విదేశాలతో దౌత్యం నెరపాలనే విధానం నెహ్రూ హయాం నుంచీ ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాకనే అది మరింత పెరిగింది. ఆయన తొలిసారి ప్రధాని కాగానే సందర్శించిన మొదటి దేశం భూటాన్. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేతగా ఎన్నికైన వ్యక్తి మొట్ట మొదటి విదేశీ పర్యటనను బుల్లి దేశం భూటాన్ తో మొదలు పెట్టటానికి కారణం.. అది బౌద్ధ దేశం కావటమే. ఆయన తన ఇటువంటి తొలి పర్యటన ద్వారా బౌద్ధ దేశాలకు ప్రేరణ ఇచ్చారు.
అమరావతిలో కాలచక్రకు హాజరైన దలైలామా
భారత దేశంలో అనేక బౌద్ధ ప్రాంతాలు ఉన్నప్పటికీ.. ఒకప్పుడు రాజధానిగా భాసిల్లి, అద్భుత స్తూపం, శిల్పసంపదలతో ఆపార చరిత్ర కలిగి ఉన్న అత్యంత ప్రాధాన్యం కల ప్రాంతం.. అమరావతి Amaravati. అక్కడ 2006, జనవరి నెలలో 13 రోజుల పాటు నిర్వహించిన ‘కాలచక్ర’ క్రతువుకు దేశ,విదేశాల నుంచి వేల సంఖ్యలో బౌద్ధ బిక్షువులు హాజరయ్యారు. 14వ దలైలామా స్వయంగా ఈ క్రతువును నిర్వహించారు. అప్పటికి 2,550 ఏళ్లక్రితం.. నాటి రాజు సుచంద్ర ఆహ్వానం మేరకు బుద్ధ భగవానుడు స్వయంగా హాజరయ్యి కాలచక్రను నిర్వహించిన అత్యంత పవిత్ర స్థలమే ‘అమరావతి’ అని భారత దేశంలోని ‘టిబేటియన్ పాలన కేంద్రం’ శ్లాఘించింది. ఎంతో ఖ్యాతి గల అమరావతితో కూడిన ప్రాంతాల్లో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం అనగానే అది దేశంలోని వివిధ రాష్ట్రాల వారితో పాటు విదేశీయులనూ విశేషంగా ఆకట్టుకొంది. అక్కడ ప్రపంచస్థాయి నిర్మాణాలు వస్తాయనే విషయాన్ని పక్కన పెడితే.. అమరావతి ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది. జపాన్ వంటి దేశాలు తప్పక ఇటువైపు దృష్టి సారిస్తాయి. ఇప్పటికే దేశంలోని వివిధ చోట్ల గల బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి జపాన్ , మరికొన్ని దేశాలు సాయాన్ని అందిస్తూనే ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022, మే నెలలో నేపాల్, జపాన్ దేశాల్లో పర్యటించి బౌద్ధ వారసత్వాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. జపానుతో పూర్వకాలం నుంచి గల సంబంధాలపై అక్కడి ఒక పత్రికలో మోదీ ఒక వ్యాసాన్ని సైతం రాశారు. రాజకీయ, యుద్ధ తంత్రం ద్వారా చేయలేని కొన్ని పనులను బౌద్ధమనే దౌత్యం ద్వారా చేయవచ్చని చెప్పే ‘ఈనాడు’ వ్యాసంపై అప్పట్లో మంత్రిగా పనిచేసిన కన్నబాబుకు బోలెడు అభ్యంతరాలు వచ్చేశాయి. కొన్ని రాష్ట్రాల సమాహారమే దేశం. అటువంటి దేశం ఇతర దేశాలతో మంచి సంబంధాలను కొనసాగించటంలో రాష్ట్రాల పాత్రా ఉండాలి. అమరావతి రాజధానిగా ఉన్నట్లైతే అటువంటి సంబంధాలు మరింత పటిష్ట పడేందుకు వీలవుతుందని, మరో వైపు.. బౌద్ధాన్ని అభిమానించే దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయనే విశ్లేషణ నా వ్యాసంలో ఉంది. రాజధాని నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇవ్వటంతో ఇటికలకు విరాళాలు రావటం వాస్తవం. వ్యాసంలో పేర్కొన్న ఈ విషయాన్నీ మంత్రి వ్యంగ్య ధోరణిలో ప్రస్తావించారు. మొత్తం మీద కన్నబాబు నా వ్యాసంలోని అంశాలను విమర్శించినప్పటికీ.. బౌద్ధం ద్వారా దౌత్యం నెరపటానికి అమరావతి ఉపయోగపడుతుందనే ఒక కొత్త కోణానికి శాసన సభ ద్వారా ప్రాచుర్యం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు .