(‘బురుజు’ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించటానికి అవకాశాలు పుష్కలంగానే ఉన్నప్పటికీ వాటిని ఆంధ్రప్రదేశ్ పాలకులు
పట్టించుకోవటంలేదు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాలను ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదంటూ సాక్షాత్తూ 15వ ఆర్థిక సంఘానికి ఛైర్మన్ గా వ్యవహరించిన ఎన్.కె.సింగ్ వెల్లడించటం, భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి రాగలిగితే పాండిచ్ఛెరికి ప్రత్యేక హోదాను ఇస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రకటించటం వంటి పరిణామాలను ఏపీ పాలకులు పూర్తిగా విస్మరించారు. ఎంతగా అడిగినా హోదా రాదంటూ చేతులెత్తేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక కేంద్రంపై వత్తడి తేగలిగితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించగలుగుతుంది. మరో వైపు.. ‘రాష్ట్రాలకు హోదాలు ఇవ్వరాదు’ అని పేర్కొనే రఘురాం రాజన్ కమిటీ నివేదికను చేతిలో పెట్టుకొనే.. 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ప్రకటించినందున ఆ కమిటీ నివేదికకూ ఇక విలువలేనట్టే అయ్యింది. అందువల్ల హోదా మంజూరీకి పలనా నివేదికలు అడ్డు తగులుతున్నాయంటూ చెప్పేందుకు కేంద్రానికి ఆస్కారమేలేదు. ఎటొచ్చీ.. ఇటువంటి విషయాలన్నింటినీ అధికార పార్టీ ఎంపీలు లోక్ సభ, రాజ్య సభల్లో గట్టిగా చెప్పగలగితేనే పనవుతుంది. ఆంధ్రప్రదేశుకు హోదాను ఇవ్వొద్దనే విషయం ఆర్థిక సంఘం నివేదికలో లేనేలేదంటూ 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ కుండబద్దలు కొట్టారనే సంగతిని అధికారపార్టీ ఎంపీలెవరూ ఇంతవరకు ఉభయ సభల్లోనూ ప్రస్తావించనేలేదు.
హోదా వస్తే ఇటువంటి ప్రగతి సాధ్యమే(అమరావతి నమూనా)
ప్రత్యేక హోదా ఇవ్వొద్దని జాతీయ 14వ ఆర్థిక సంఘం 2015లో స్పష్టం చేసినందున ఆంధ్రప్రదేశ్ కు తాము హోదాను ఇవ్వలేకపోతున్నామంటూ మోదీ సర్కారు దాదాపు ఆరేళ్లగా చెబుతూ వస్తున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఇటీవల కాలంలో బహిర్గతమయ్యాయి. జాతీయ ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగ బద్దంగా ఏర్పాటయ్యే సంస్థ కావటంతో అదిచ్చే సిఫార్సులకూ చాలా విలువ ఉంటుంది. అటువంటి ఆర్థిక సంఘమే ప్రత్యేక హోదాలంటూ ఇవ్వరాదని చెప్పింది కాబోలని ఆంధ్రప్రదేశ్, హోదా కోసం ఆశపడుతున్న మరికొన్ని రాష్ట్రాలు భావించాయి. ప్రత్యేక హోదాలు ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం తన నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదని కొంత మంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతూ వచ్చినప్పటికీ.. 15 ఆర్థిక సంఘానికి ఛైర్మన్ గా వ్యవహరించిన ఎన్.కె.సింగ్ అదే విషయాన్ని కుండబద్దలు కొట్టటంతో ఇప్పుడది తిరుగులేని ఆధారంగా పరిణమించి.. హోదాల అంశం మళ్లీ తెరపైకి వచ్చినట్లయ్యింది. ఛైర్మన్ ఎన్.కె.సింగ్ తన తుది నివేదికను 2020 నవంబరు నెలలో రాష్ట్రపతికి సమర్చించిన తర్వాత తాను రాసిన ‘పెర్రెయిట్స్ ఆఫ్ పవర్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పనేలేదని దానిలో ఆయన తేటతెల్లంచేశారు. ఇలా ఆయన ఏపీ హోదా గురించి ప్రత్యేకంగా చెప్పటానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఆర్థిక సంఘం ఛైర్మన్ కావటానికి ముందు ఆయన బీహార్ లోని జనతాదల్ (యు) పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. బీహారుకు ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ కేంద్రంపై గట్టిగా వత్తడి తెచ్చిన వారిలో ఆయనొకరు. ఆయన 2012లోనే బీహారుకు హోదా గురించి రాజ్యసభలో అడగ్గా.. నిబంధనలు వర్తించనందున హోదాను ఇవ్వటం సాధ్యంకాదని నాటి ఆర్థిక మంత్రి చిదంబరం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఆర్థిక నిపుణుడైన ఎన్.కె.సింగ్.. రాజ్యసభ సభ్యత్వం అనంతరం 15 ఆర్థిక సంఘం ఛైర్మన్ గా వ్యవహరించారు.
ప్రత్యేక హోదాగల ఉత్తరాఖండ్ లో ని ప్రగతి ఇది
ఆర్థిక సంఘం తన సిఫార్సుల నివేదికను ఇచ్చేముందు సహజంగానే అంతకు ముందటి ఆర్థిక సంఘాల నివేదికలనూ క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిలోని కొన్ని అంశాలను తన నివేదికలో అవసరమైన చోట ఉటంకిస్తుంది. ఇలా 14వ ఆర్థిక సంఘం 2015-20 కాలానికి అందజేసిన సిఫార్సుల నివేదికను పరిశీలించిన ఎన్.కె.సింగ్.. దానిలో అసలు ప్రత్యేక హోదాల నిషేధమనే విషయమే లేదని గ్రహించారు. వెనుకబడిన బీహార్ రాష్రానికి హోదా కావాలని పట్టుపడుతూ వచ్చిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ కు 2014లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు ప్రత్యేక హోదాను ఇస్తున్నట్టుగా ప్రకటించటం ఆకర్షించటం వల్లనే ఈ అంశంపై ఆయన ఎక్కువ దృష్టి సారించినట్టు తన తాజా పుస్తకంలోని అంశాలను బట్టి తేటతెల్లమవుతోంది. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ విభజన, ప్రత్యేక హోదా హామీ అంశాలను దీనిలో పొందుపర్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును 2014, ఫిబ్రవరి 20వ తేదీన చాలా హడావిడిగా ప్రవేశపెట్టారని, ఇదొక విచిత్రమైన బిల్లు అని కూడా వ్యాఖ్యానిస్తూ.. ప్రత్యేక హోదాను కల్పించకపోవటం వల్లనే చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారనీ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎన్.కె.సింగ్ తన పుస్తకంలో స్పష్టంచేశారు.
ప్రత్యేక హోదాతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
జాతీయ ఆర్థిక సంఘాలు ఎప్పుడూ అయిదేళ్లకు సరిపడా కేటాయింపులు, సిఫార్సులతో ఒకే నివేదికను అందజేస్తుంటాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాలు, విపత్తుల నిర్వహణ వంటి వాటికి, స్థానిక సంస్థలకు గ్రాంటులు వాటిలో ప్రధానమైనవి. 15వ ఆర్థిక సంఘం మాత్రం... కాశ్మీర్ పునర్విభజన నేపథ్యంలో 2020-21కి వర్తించేలా ఒక నివేదికను, 2021-25 మధ్య వర్తించేలా మరో నివేదికను అందజేసింది. రెండో నివేదికను 2020, నవంబరులో రాష్ట్రపతికి అందజేసిన తర్వాతనే ఎన్.కె.సింగ్ తన పుస్తకాన్ని బహిర్గతపర్చారు. ప్రత్యేక హోదాలను ఇవ్వొద్దన్న సంగతిని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదన్న కీలక అంశం దీనిలో ఉంది. ఆయన తన స్వ రాష్ట్రం బీహార్ కు ప్రత్యేక హోదాకోసం విశేషంగా కృషి చేసి ఉండటం వల్లనే ఈ విషయానికి ప్రాధాన్యమిచ్చారు. ఆయన 2012లో బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి రాజ్యసభలో పట్టుపట్టగా.. ఆ మరుసటి ఏడాదే ప్రత్యేక హోదాలు అనేవి ఉండరాదని పేర్కొంటూ రఘురాం రాజన్ కమిటీ రూపొందించిన ఒక నివేదిక కేంద్రానికి అందింది. నివేదిక అందజేసిన కొద్ది రోజులకే రఘురాం రాజన్.. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నరుగా నియమితులయ్యారు. దేశంలో ప్రస్తుత 11 రాష్ట్రాల హోదాలను సైతం తీసివేసి.. తాను సూచించిన ఒక సూచీ ప్రకారం అన్ని రాష్ట్రాల పరిస్థితిని అంచనా వేయాలని ఆయన సిఫార్సు చేశారు. దీని ప్రకారం.. అభివృద్ధి చెందిన, తక్కువ అభివృద్ధి చెందిన, బాగా తక్కువ అభివృద్ధి చెందిన అనే మూడు రకాల వర్గీకరణల్లోకి ఆయా రాష్ట్రాలు వస్తాయి. ‘బాగా తక్కువ అభివృద్ధి వర్గీకరణలోకి వచ్చే రాష్ట్రాలకు కేంద్రం అదనపు సాయాన్ని అందజేయాల్సివుంటుంది. ( ఆర్థికంగా సతమతమయ్యే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వొచ్చు: వచ్చేవారం ‘బురుజు’లో)